బాసర క్షేత్రంలో ఘనంగా మూల నక్షత్ర వేడుకలు 

బాసర క్షేత్రంలో ఘనంగా మూల నక్షత్ర వేడుకలు 
  • గతంతో పోలిస్తే భారీగా తగ్గిన భక్తుల రద్దీ 
  • భక్తులు లేక వెల వెల బోయిన క్యూ లైన్ లు 

బాసర, ముద్ర:-శ్రీ శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆరవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే ఆలయ అర్చకులు,వేద పండితులు వేద మంత్రోత్సరణలతో అమ్మవారికి పుష్పార్చన,కుంకుమార్చన పూజలు నిర్వహించారు, అనంతరం అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించారు. శుక్రవారం శుభ దినం అమ్మవారి జన్మ నక్షత్రమైన  మూల నక్షత్రం కావడంతో వేకుజామున 4 గంటల నుండి అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. క్యూలైన్లలో ఉన్న భక్తులకు,చిన్న పిల్లలకు ఆలయ అధికారులు, స్వచ్ఛంద సేవ సమితి సభ్యులు పండ్లు,పాలు,బిస్కెట్లు అందిచారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా వరకు భక్తుల రద్దీ తగ్గడంతో ఆలయం వద్ద ఉన్న దుకాణ వ్యాపారులు నిరాశ కు గురయ్యారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర,కర్ణాటక నుండి భక్తులు తరలి వచ్చారు.ముందుగా పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసి అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకులచే చిన్నారులకు అక్షర భ్యాసం పూజలు జరిపించారు.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వైద్య బృందం,జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అమ్మవారికి పట్టు వస్తువులు సమర్పించేవారు. ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ ఉండడంతో ఆలయ చైర్మన్, ఈఓ ఏఈవో, లు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ముధోల్ తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.భైంసా ఏ ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ముధోల్ సిఐ వినోద్ రెడ్డి, బాసర ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు..